రాజన్న సిరిసిల్ల: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు వరుణ యాగం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వహణ అధికారి (ఈవో) రమాదేవి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు తలఎత్తకుండా వరుణ దేవుని అనుగ్రహం కలగాలని ఈ యాగం తలపెట్టారు.
మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో ఏర్పాట్లు
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆలయంలో యాగానికి కావలసిన వైదిక, పరిపాలనాపరమైన ఏర్పాట్లను వేగవంతం చేసినట్లు ఈవో తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా వానలు సమృద్ధిగా కురవడమే లక్ష్యంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమాలు, జపాలు నిర్వహించనున్నారు.
సమృద్ధిగా పంటలు, ప్రజాక్షేమమే లక్ష్యం
రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి చెరువులు, జలాశయాలు నిండాలని, వ్యవసాయ పంటలు పండి రైతాంగం ఆనందంగా ఉండాలని ఆలయ వేద పండితులు, అర్చకులు ఈ యజ్ఞ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ప్రజాక్షేమం, శాంతి సామరస్యాలు సిద్దించాలని ఆ రాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ప్రత్యేక జపాలు, అభిషేకాలు చేపట్టనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.


