నల్లగొండ: జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో, రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి (DAO) వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. నల్లగొండ మండల రైతు కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరుతడి విత్తనాల ప్రదర్శన, అమ్మకపు స్టాల్స్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు.

ఈనెల 29 వరకు విత్తనాలు అందుబాటులో

రైతులకు అవసరమైన విత్తనాలను క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉంచేందుకు జిల్లాలోని రైతు వేదికల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఈనెల 29వ తేదీ వరకు ఈ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. జాతీయ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో ప్రైవేటు విత్తన డీలర్లు సంయుక్తంగా ఈ ప్రదర్శన, విక్రయ ప్రాంతాలను నిర్వహించనున్నారు.

వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు

వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు కంది, పెసర, మినుములు, జొన్నలు, నువ్వులు, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేయడం వల్ల తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖాధికారి వినోద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్నదాతలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, రైతు వేదికల్లో సమకూర్చిన విత్తనాలను కొనుగోలు చేసి ఆరుతడి పంటల వైపు మళ్లాలని కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Jul 2026 | 11:13 PM IST
Tags: