షాద్‌నగర్: వర్షాలు సకాలంలో కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలకు తాగునీరు మరియు సాగునీటి ఇబ్బందులు తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండల పరిధిలోని జానంపేట గ్రామంలో సోమవారం వరుణ యాగాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక క్రతువు ప్రారంభమైంది.

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు

ఈ యాగంలో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని అన్నారు. సాగు పనులు ఆలస్యం కావడమే కాకుండా, పలు ప్రాంతాల్లో తాగు, సాగు నీటి ఎద్దడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థనలు

ప్రకృతి అనుకూలించి వరుణ దేవుని కరుణతో సమృద్ధిగా వర్షాలు కురవాలని, గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, జలాశయాలు జలకళతో నిండాలని బక్కని నర్సింహులు ఆకాంక్షించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన ప్రత్యేక హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఒగ్గు కిషోర్, ప్రముఖ వ్యాపారవేత్త సాయిశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకుడు కుమార్ గౌడ్లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Jul 2026 | 12:36 PM IST
Tags: