షాద్‌నగర్: ఎల్ నినో ప్రభావంతో తలెత్తుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో, పంటలు పూర్తిగా చేతికందే వరకు రైతులకు మరో రెండు గంటల పాటు అదనపు విద్యుత్ సరఫరా అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. గురువారం షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం వల్ల నీటి కొరత, విద్యుత్ పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో కరోనా సంక్షోభాన్ని ఏ విధంగా ఐక్యంగా ఎదుర్కొన్నామో, ప్రస్తుత ప్రకృతి విపత్తును కూడా అదే స్ఫూర్తితో అధిగమించాల్సి ఉందని, ప్రజల నిత్యావసరాలైన తాగునీరు, విద్యుత్‌ను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పొదుపు చేయాలని పిలుపునిచ్చారు.

​ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను ప్రత్యేకంగా కలిసినట్లు ఆయన వెల్లడించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో వరి పంటలు చివరి దశకు చేరాయని, మరో 15 నుంచి 20 రోజులు గడిస్తే చేతికి వస్తాయని వివరించి, రైతులను ఆదుకునేందుకు అదనంగా మరో రెండు గంటలు కరెంటు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. రైతుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, రాబోయే 15-20 రోజుల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగేలా ఆదేశాలు జారీ చేసిన సీఎంకు, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అగునూరు బసవేశ్వర్, మాజీ మార్కెట్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మార్కెట్ డైరెక్టర్ కరుణాకర్, చెంది తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, పట్టణ అధ్యక్షుడు నలమోని శ్రీధర్, కౌన్సిలర్లు మురళీమోహన్ అప్పి, కళ్యాణ్ కార్ దిలీప్, ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, ముబారక్, కాంగ్రెస్ నాయకులు మంగ మధు, ఇబ్రహీం, లింగారెడ్డిగూడ అశోక్, బుడ్డ నరసింహ, రఫిక్ పటేల్, శ్రీహరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 15 Oct 2026 | 02:14 PM IST
Tags: