శంషాబాద్: నగర శివారులోని శంషాబాద్ పరిధిలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపుతోంది. నర్కుడ సమీపంలోని ఓ మహిళా మండలి రీహాబ్ సెంటర్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న ఇద్దరు 14 ఏళ్ల బాలికలు అదృశ్యమయ్యారు. ఈ నెల 8వ తేదీ రాత్రి సమయంలో డైనింగ్ హాల్కు వెళ్తున్న క్రమంలో వారు కనిపించకుండా పోయినట్లు సమాచారం.
ఈ సెంటర్లో మొత్తం 50 మంది బాలికలు ఉంటూ చదువుకుంటున్నారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా భోజనం చేసేందుకు వెళ్లిన ఇద్దరు బాలికలు తిరిగి రాకపోవడంతో సెంటర్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే సెంటర్ పరిసర ప్రాంతాలతో పాటు బంధువులు, పరిచయస్తుల వద్ద గాలింపు చేపట్టారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
సెంటర్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. అదృశ్యమైన బాలికలు ఎక్కడికి వెళ్లారు? వారు స్వచ్ఛందంగా వెళ్లిపోయారా? లేక ఎవరైనా తీసుకెళ్లారా? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. సెంటర్ పరిసరాల్లోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తూ, అందుబాటులో ఉన్న సమాచారంతో బాలికల ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.


