హైదరాబాద్: ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పథకంలో పనిచేస్తున్న ఎఫ్టీఈ ఉద్యోగులకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం దసరా కానుక అందించింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 3,800 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రయోజనం కల్పిస్తూ అధికారికంగా జీవో జారీ చేసింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో దాదాపు 20 ఏళ్లుగా ఉద్యోగులు చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సర్వీసు, రిటైర్మెంట్ నిబంధనల ప్రకారం కనీసం రూ. 4 లక్షల గ్రాట్యుటీతో పాటు, పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు రూ. 10 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ఈ నిర్ణయంతో దీర్ఘకాలంగా విధుల్లో కొనసాగుతున్న ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో కొండంత భరోసా లభించినట్లయింది. తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కలకు ఎఫ్టీఈ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఉద్యోగుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసిన ఉద్యోగులు సర్వీసు ముగిసిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఏళ్ల తరబడి మూలనపడ్డ సమస్యలకు దశలవారీగా పరిష్కారం చూపుతున్నామని, జీవిత చరమాంకంలో ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం తమ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపిందని, భవిష్యత్తుపై ధీమాను పెంచిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.


