హైదరాబాద్: తెలంగాణలో రైతులకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను పంటలు వేసుకోవద్దని చెప్పే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. వ్యవసాయానికి కనీసం సాగునీరు, వేళకు విద్యుత్ సరఫరా చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి ఎద్దడి తలెత్తుతోందని, పాలనపై దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వం చేపట్టిన మెట్రో టెండర్లను రద్దు చేశారని విమర్శించారు. కొత్తగా బుల్లెట్ రైళ్లు తీసుకువస్తామని చెబుతున్నప్పటికీ, దాని అలైన్మెంట్ ఇంకా ఖరారు కాలేదని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ స్పష్టం చేశారని గుర్తుచేశారు. అలైన్మెంట్ లేకుండా బహదూర్ గూడలో భూములను ఏ ఉద్దేశంతో సేకరిస్తున్నారని నిలదీశారు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నలుమూలలా వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని, భూములు అమ్మి పాలన సాగించాలని సీఎం భావిస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. నాదర్గుల్ పరిధిలోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు స్వస్తి పలికి ప్రజల, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.


