మంగళపల్లి: మంగళపల్లి గ్రామంలో సర్పంచ్ మౌనిక అధ్యక్షతన శుక్రవారం ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్, మండల వ్యవసాయ అధికారి (ఏఓ) శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు, రైతులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఏఓ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. కాబట్టి రైతులు వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ నీటితో పండే జొన్న, మొక్కజొన్న, శనగ, కూరగాయలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. తాగునీటిని వృధా చేయకుండా ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీఛార్జ్ గుంతలు, ఫారం పాండ్స్ నిర్మించుకోవాలని సూచించారు. పశువులకు తాగునీటి తొట్లు, పశుగ్రాసం అందుబాటులో ఉంచుకోవాలని, ఉపాధి హామీ పథకం పనులను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జగన్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, స్థానిక రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 16 Oct 2026 | 10:40 PM IST
Tags: