ఆమనగల్లు: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మహేశ్వరం డివిజన్ ఏసీపీ ఎస్. జానకి రెడ్డి శుక్రవారం ఆమనగల్లు పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఎస్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించగా, ఏసీపీ పరేడ్, టర్నౌట్ను పరిశీలించారు.
అనంతరం పోలీస్ స్టేషన్లోని సీసీటీఎన్ఎస్ (CCTNS) రికార్డులు, పెండింగ్ కేసులు, శాంతిభద్రతల పరిస్థితి, పెట్రోలింగ్, మహిళల భద్రత, వారెంట్లు, స్టేషన్ పరిపాలనా వ్యవహారాలను ఏసీపీ సుదీర్ఘంగా సమీక్షించారు. రికార్డుల గదులతో పాటు స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సూచించారు. నిరంతర పెట్రోలింగ్ ద్వారా నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి మెరుగైన ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు అందించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.
అనంతరం ఆమనగల్లు ప్రభుత్వ కళాశాల మైదానాన్ని ఏసీపీ సందర్శించి, రాబోయే దసరా పండుగ ఉత్సవాలకు సంబంధించి చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పండుగ వేళ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు సీఐ ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


