హైదరాబాద్: నగరంలోని గాంధీభవన్‌లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ ద్వారా ఓటు హక్కును తొలగించే కుట్ర జరుగుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే పట్టభద్రులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పట్టభద్రులు ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ముందుకు రావాలని సూచించారు. ఓటు నమోదు ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని, కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

 హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులతో చర్చించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భరోసానిచ్చారు.

పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి సామా రామ్మోహన్ రెడ్డి గెలుపునకు పార్టీ శ్రేణులు సైనికులా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 16 Oct 2026 | 10:51 PM IST
Tags: