కల్వకుర్తి: ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా నిలుస్తూ ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులను రాజకీయ నాయకులు గౌరవించాల్సిందేనని, వారిని అవమానపరిచే ధోరణిని ఎంతమాత్రం సహించబోమని స్ఫూర్తి న్యూస్ ఛానల్ జర్నలిస్టు కస్తూరి శ్రీనివాసులు స్పష్టం చేశారు. కల్వకుర్తి పట్టణంలో ఓ రాజకీయ నాయకుడు జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
గత నెల 4వ తేదీన ఒక కార్యక్రమానికి సంబంధించిన వివరాల కోసం సీనియర్ జర్నలిస్టు శేఖర్ గౌడ్ ఫోన్ చేయగా, తమ పత్రికకు వార్తలు ఇవ్వబోమని, అది తమకు వ్యతిరేక పత్రిక అని పేర్కొంటూ సదరు నాయకుడు సమాధానం ఇచ్చినట్లు శ్రీనివాసులు ఆరోపించారు. జర్నలిస్టు ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ప్రజల పక్షాన నిలబడటమే అతని బాధ్యత అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలవాలన్నా, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా మీడియా అవసరం ఉంటుందనే విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా సత్యం రెడ్డి వ్యవహారంపై జర్నలిస్టులు సమావేశమై చర్చించామని, ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు ఆయనకు సంబంధించిన కార్యక్రమాల వార్తల ప్రచురణను బహిష్కరించాలని నిర్ణయించినట్లు శ్రీనివాసులు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా ఏ పార్టీ నాయకుడైనా సరే జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఐక్యంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ఏ చర్యనైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు.


