వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఐక్యత ఫౌండేషన్ సౌజన్యంతో, వందేమాతరం ఫౌండేషన్, మై విలేజ్ మోడల్ విలేజ్, శ్రుతిలయ కల్చరల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో “మన వెల్దండ – పాదపూజ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ పాపిశెట్టి రామన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేటి విద్యార్థుల్లో సంస్కారం, గురువుల పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావం పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ పాపిశెట్టి రామన్న మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా మంచి విలువలు, క్రమశిక్షణ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులను, గురువులను ఎల్లప్పుడూ గౌరవిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధిలో విద్య కీలకమని, భావితరాల భవిష్యత్తు కోసం ఇలాంటి సత్సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య, గ్రామ పాలకవర్గ సభ్యులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు వరప్రసాద్ రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్కు చెందిన మాధవ రెడ్డి, నితిన్ గౌడ్, చిత్తరంజన్ దాస్ మరియు వారి బృందం, రామన్న మిత్రమండలి సభ్యుడు శ్రీను నాయక్, విద్యార్థినుల తల్లిదండ్రులు, పత్రికా మిత్రులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో మానవీయ విలువలను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు.


