షాద్‌నగర్: తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సన్మాన సభలో చోటుచేసుకున్న పరిణామాలపై ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యమకారుల మధ్య నెలకొన్న వివాదానికి చివరకు తెరపడింది. ఆదివారం ఆనాటి టీచర్స్ జేఏసీ ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను ఆయన స్వగృహంలో కలిసి, సభ నిర్వహణలో తమకు జరిగిన అవమానాన్ని, ఆవేదనను ప్రత్యక్షంగా వివరించారు.
క్షమాపణలు తెలిపిన కరుణాకర్
ఉద్యమకారుల ఆవేదనపై మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఆనాటి తెలంగాణ లెక్చరర్ ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ స్పందించారు. సభ నిర్వహణలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలోనే ఆయన విచారం వ్యక్తం చేసి క్షమాపణలు తెలిపారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందిస్తూ.. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులంటే తనకు ఎంతో గౌరవం ఉందని, భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినా అన్ని సంఘాలను, వర్గాలను కలుపుకొని వెళ్తామని హామీ ఇచ్చారు. ఉద్యమకారుల గౌరవార్థం అవసరమైతే మరోసారి సన్మాన సభను కూడా నిర్వహిస్తామని తెలిపారు. వివాదాలకు స్వస్తి చెప్పి అందరూ ఐక్యంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.


