షాద్‌నగర్: మెదక్ పట్టణంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటనను జాతీయ బీసీ సేన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, షాద్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జయ శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వీరనారి విగ్రహంపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జయ శ్రీకాంత్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదని, అన్యాయంపై పోరాడిన ధైర్యానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక అని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో నిలిచి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఆమె విగ్రహాన్ని ధ్వంసం చేయడం ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను పోలీసులు 24 గంటల్లోగా గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం కేసు నమోదుతో సరిపెట్టకుండా నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మహనీయుల విగ్రహాలపై దాడులు చేయడం ద్వారా వారి వీర చరిత్రను, పోరాట స్ఫూర్తిని చెరిపేయలేరని స్పష్టం చేశారు. ఐలమ్మ త్యాగాలను అవమానించే చర్యలను సమాజం ఎంతమాత్రం సహించదని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు మహనీయుల విగ్రహాలకు పూర్తి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఐలమ్మ ఆత్మగౌరవ పోరాటం ఏ ఒక్క వర్గానికో లేదా రాజకీయ పార్టీకో పరిమితం కాదని, సమాజమంతటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ సహా అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను ఖండించాలని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 13 Oct 2026 | 08:18 PM IST
Tags: