హైదరాబాద్: భారతదేశంలో పెరుగుతున్న జనాభా అసమతుల్యత దేశ ఉనికికే ముప్పుగా పరిణమిస్తోందని రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యకారిణి ప్రతినిధి మండలి ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశాల వివరాలను ప్రతినిధులు గుదిమెళ్ల అనంతలక్ష్మి, ఉమారాణి, చారుశీల వెల్లడించారు. జనాభా కేవలం ఒక గణాంకం కాదని, అది సమాజ గుర్తింపు అని పేర్కొన్నారు.
తగ్గుతున్న హిందూ జనాభా నిష్పత్తి
ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ నివేదిక ప్రకారం 1951లో 84.68 శాతంగా ఉన్న హిందూ జనాభా 2015 నాటికి 78.06 శాతానికి తగ్గిందని, ముస్లిం జనాభా 9.84 శాతం నుండి 14.09 శాతానికి పెరిగిందని వారు వివరించారు. ఈ మార్పుల నేపథ్యంలో ప్రస్తుత జనాభా నియంత్రణ విధానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. కాశ్మీర్ లోయ, బెంగాల్, బీహార్, కేరళ, అస్సాంలలోని కొన్ని ప్రాంతాల్లో మత సామరస్యం దెబ్బతినడానికి ఈ అసమతుల్యతే కారణమని తెలిపారు.
అక్రమ చొరబాట్లు, సామాజిక మార్పుల ప్రభావం
సరిహద్దుల గుండా రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లు, మతమార్పిడులు, లవ్ జిహాద్ వల్ల జనాభా సమిష్టి స్వరూపం దెబ్బతింటోందని పేర్కొన్నారు. మరోవైపు ఉన్నత విద్యావంతులైన హిందూ యువతలో ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లలు కనకపోవడం ("డింక్" సంస్కృతి) లేదా ఒక్కరికే పరిమితం కావడం వంటి అంశాలు జనాభా తగ్గుదలకు దోహదం చేస్తున్నాయని విశ్లేషించారు. రాబోయే 50 ఏళ్లలో భారతదేశ యువ శక్తి తగ్గిపోయి సామాజిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.
కఠిన చట్టాలు, ఏకరీతి జనాభా విధానానికి డిమాండ్
చొరబాట్లు, అక్రమ మతమార్పిడులను తక్షణమే అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రతినిధి మండలి కోరింది. సరిహద్దుల్లో నిఘా పెంచి అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించి బహిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు వర్తించేలా ఏకరీతి జాతీయ జనాభా విధానం, ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) ని అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది.


