సిరిసిల్ల: భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. 'తెలంగాణ జలసిరి' కార్యక్రమం, 'ఇందిరమ్మ ఇండ్ల' నిర్మాణ పురోగతిపై హౌసింగ్ ఏఈలు, ఎంపీడీఓలు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో జిల్లా కలెక్టరేట్ నుంచి ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎల్ నినో ఎఫెక్ట్: యుద్ధ ప్రాతిపదికన జలసిరి పనులు 

ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి భూగర్భ జలాలు పడిపోతున్నాయని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే తరాలకు తాగు, సాగునీరు అందించాలంటే ఇప్పటి నుంచే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో ఇంకుడు గుంతలు, పంట కుంటలు (ఫాం పాండ్స్), ఊట కుంతలు, బోరు బావుల రీచార్జ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పొలాల్లో నీరు ఇంకి భూగర్భ జలాలు పెరిగేలా రైతులకు అవగాహన కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వేగం పెంచాలి 

అదే సమయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. మొదటి దశలో మంజూరైన ఇండ్ల పురోగతిని మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలు ఆలస్యం కాకుండా నిర్దేశిత లక్ష్యం మేరకు వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపికలో గుడిసెలు, రేకుల షెడ్లలో నివసించే నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ సహాయం మరియు మార్గదర్శకాలపై లబ్ధిదారులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Jul 2026 | 01:45 PM IST
Tags: