వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. రూసా 2.0 (RUSA 2.0) పథకం కింద విశ్వవిద్యాలయానికి రూ.50 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ వెల్లడించారు. ఈ నిధులు కేయూలో విద్య, పరిశోధనా ప్రమాణాలు పెంచడానికి ఎంతగానో దోహదపడనున్నాయి.
పరిశోధన, ఇన్నోవేషన్ హబ్‌ల అభివృద్ధికి ప్రాధాన్యం
'రిసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్' విభాగంలో ఈ రూ.50 కోట్ల నిధులను ఆమోదించారు. వీటి ద్వారా వర్సిటీ ప్రాంగణంలో నూతన పరిశోధనా కేంద్రాలు, ఇన్నోవేషన్ హబ్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్లు నెలకొల్పనున్నారు. విద్యార్థులకు ఉపాధి కల్పించేలా మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్‌ను సమర్థవంతంగా వినియోగించనున్నట్లు కేంద్రం తెలిపింది.
పార్లమెంట్‌లో ప్రశ్న లేవనెత్తిన వరంగల్ ఎంపీ
గత మూడేళ్లలో కాకతీయ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కళాశాలలకు కేంద్రం అందించిన ఆర్థిక, విద్యా మరియు పరిశోధన సహాయంపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పార్లమెంట్‌లో వివరాలు కోరారు. పరిశోధనలు, అధ్యాపకుల అభివృద్ధి, మంజూరైన నిధుల వినియోగంపై ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ ఈ వివరాలను వెల్లడించింది.


