ఎల్బీనగర్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో చేసిన వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు “బీఆర్ఎస్ పోరుబాట” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని ఒక ప్రైవేట్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు గడుస్తున్నా వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని సుధీర్ రెడ్డి మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, మహిళలకు నెలకు రూ. 2,500, వృద్ధులు, వితంతువులకు రూ. 4 వేలు, వికలాంగులకు రూ. 6 వేలు, రైతుబంధు, తులం బంగారం వంటి హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజానీకానికి చేరవేసేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్
సెప్టెంబర్ 2 (ప్రజల పోరుబాట - ఎల్బీనగర్ చౌరస్తా) ఆరు గ్యారెంటీలు, హామీల వైఫల్యాలపై భారీ ధర్నా మరియు బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం.
సెప్టెంబర్ 3 (ప్రజల పోరుబాట - నాగోల్ డివిజన్, రాక్ టౌన్ కాలనీ) 22-A భూముల ప్లాట్ల సమస్యపై నిరసన మరియు ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాన్ని నిలదీత.
సెప్టెంబర్ 4 (మహిళల పోరుబాట - ఎల్బీనగర్ చౌరస్తా) మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోరుతూ వంటావార్పు కార్యక్రమం. రూ. 2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి తదితర హామీల అమలుకు డిమాండ్.
సెప్టెంబర్ 5 (విద్యార్థులు & యువత పోరుబాట - P&T కాలనీ, గడ్డిఅన్నారం) ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ అమలు కోసం డిమాండ్ చేస్తూ యూత్ డిక్లరేషన్పై సమావేశం.
సెప్టెంబర్ 6 (ఆటో కార్మికుల పోరుబాట - పనామా X రోడ్ నుండి BN రెడ్డి నగర్) ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి, కార్మికులు మరియు ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీత.
సెప్టెంబర్ 7 (ప్రజావాణి పోరుబాట) 420 హామీల వైఫల్యాలపై అధికారులకు వినతిపత్రాల సమర్పణ. హయత్నగర్, ఉప్పల్, సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి / వినతిపత్రాల అందజేత.
ఈ సమావేశంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


