మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని పోరండ్ల గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి గ్రామస్థుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కోతల నేపథ్యంలో వరి పంటల పరిస్థితిని పరిశీలించి, రైతులను పరామర్శించేందుకు గురువారం ఉదయం గ్రామానికి వచ్చిన ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేదని నిలదీయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా పోరండ్ల నుంచి సిద్దాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మిస్తామని, ఒకవేళ రోడ్డు వేయకపోతే గ్రామంలో అడుగుపెట్టనని సబితా ఇంద్రారెడ్డి బహిరంగంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నికలు ముగిసి కాలం గడుస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, బీటీ రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన మాజీమంత్రిని గ్రామస్థులు నిలదీయడంతో అక్కడ కొంతసేపు గందరగోళం ఏర్పడింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బుడుగు రాఘవేందర్, ఉపసర్పంచ్ మాదిలాపురం పాండు, వార్డు సభ్యులు బుడుగు అంజయ్య, ఎర్ర యాదయ్య, ఎన్. చంద్రశేఖర్, మోడీ మధుకర్, పార్టీ సీనియర్ నాయకులు పెంజర్ల యాదయ్య, మోడీ సురేష్, ఎర్ర లింగం, బుడుగు మల్లేష్, ఎర్ర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 15 Oct 2026 | 02:37 PM IST
Tags: