న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన, ప్రాంతీయ రవాణా అనుసంధానతను పెంచే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేలాది కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
పర్యటన ప్రారంభంలో ఉదయం జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీనితో పాటు విమాన ప్రయాణాలను సామాన్యులకు మరింత చెంతకు చేర్చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరించిన ఉడాన్ (UDAN) పథకానికి కూడా ఆయన ఇక్కడే శ్రీకారం చుట్టనున్నారు.
అనంతరం బాలోతరాలో సుమారు ₹1.06 లక్షల కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ పర్యటన ముగింపులో బాలోతరాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల విస్తరణ వేగంపై ప్రజలను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు.


