న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేశ ప్రజలను, ముఖ్యంగా నిరసన తెలుపుతున్న యువతను ఉద్దేశించి ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని భాగస్వామ్యం చేశారు.

తల్లిపై నిందలు వేసినా క్షమాగుణమే

జంతర్ మంతర్ వద్ద కొందరు యువకులు ఏ నాగరిక సమాజం అంగీకరించని రీతిలో అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారని ప్రధాని తెలిపారు. తనతో పాటు తన దివంగత తల్లిని కూడా దూషించడం పట్ల సమాజంలో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని, సాంస్కృతిక దిగ్భ్రాంతిని (కల్చరల్ షాక్) తాను అర్థం చేసుకోగలనని అన్నారు. అయితే, చిన్నతనంలో తప్పులు చేయడం సహజమని, ఆ తప్పులను దిద్దుకునే అవకాశం కూడా అదే బాల్యంలో ఉంటుందని గుర్తుచేశారు.

అద్భుతమైన ఉదాహరణతో సందేశం

దారి తప్పిన ఈ పిల్లలను హత్తుకుని సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత మనపైనే ఉందన్న ప్రధాని.. "కొన్నిసార్లు నోటిలోని పళ్ల కింద నాలుక పడి రక్తం వస్తుంది. అంతమాత్రాన మనం పళ్లను విరగ్గొట్టుకోము కదా! ఎందుకంటే పళ్లూ మనవే, నాలుకా మనదే. అలాగే ఆ పిల్లలు కూడా మనవారే" అని వ్యాఖ్యానించారు. వారికి శిక్షలు వేయడం, కోర్టుల చుట్టూ తిప్పడం వల్ల పరిస్థితులు మారవని, తాను వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని ప్రకటించారు.

కలిసి నడుద్దాం.. దేశాన్ని నిర్మిద్దాం

తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ దేశ పురోగతి కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామని యువతకు ప్రధాని పిలుపునిచ్చారు. "నేను మీ కోసమే జీవిస్తున్నాను, మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే శ్రమిస్తున్నాను" అని పేర్కొంటూ ప్రధాని తన వీడియో సందేశాన్ని ముగించారు.

Read latest India News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 31 Jul 2026 | 11:23 PM IST
Tags: