నల్లగొండ: జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో 18వ ఈశా గ్రామోత్సవం వేడుకలు అత్యంత అట్టహాసంగా జరిగాయి. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు నిర్వహించిన ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో యువకులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ రకాల క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) అధికారి శేఖర్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి జీవనానికి గాలి, నీరు ఎంత ప్రధానమో, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రీడలు కూడా అంతే కీలకమని స్పష్టం చేశారు.
గ్రామీణ స్ఫూర్తి పునరుజ్జీవనమే లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు 2004లో ఆధ్యాత్మిక గురు సద్గురు ఈశా గ్రామోత్సవాన్ని ప్రారంభించారని శేఖర్ రెడ్డి గుర్తుచేశారు. భారతీయ గ్రామీణ సంస్కృతి, క్రీడా ప్రాధాన్యాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఈ వేడుకలు ఎంతో విశిష్ట పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు, స్థానిక యువత పాల్గొన్నారు.


