యాదాద్రి భువనగిరి: మరో రెండు నెలల్లో మోత్కూరు రాజన్నగూడెం అసంపూర్తిగా ఉన్న రహదారి పనులన్నీ పూర్తి కావాలని, లేకపోతే ఎవర్నీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. శుక్రవారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన రాజన్నగూడెం రహదారి నిర్మాణ పనులను ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ఆయన క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు.

పనుల్లో జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అసంపూర్తిగా ఉన్న రహదారి కారణంగా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై పనుల్లో ఎలాంటి జాప్యానికి అవకాశం ఇవ్వకుండా వచ్చే రెండు నెలల్లో అన్ని పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి ఇదే అనుకూల సమయమని పేర్కొన్నారు. రోలింగ్ పనులను వెంటనే పూర్తి చేసి, బీటీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించాలని సూచించారు.

సొంత బాధ్యత తీసుకుంటా – బిల్లులు విడుదల చేస్తాం

ప్రతిరోజూ రహదారి పనులను పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేసే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. పనులు పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్ల బిల్లులు విడుదలయ్యేలా తాను స్వయంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే మోత్కూరు సెంటర్ నుంచి అమ్మనబోలు వైపు వెళ్లే రహదారి విస్తరణ పనులకు తక్షణమే అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్ అండ్ బి ఎస్.ఈ రాంబాబు, డి.ఈ సురేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 24 Jul 2026 | 09:09 PM IST
Tags: