హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మరింత నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించే లక్ష్యంతో ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ (MCR HRD) లోని బోధి పెవిలియన్‌లో దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు అందజేశాయి.
రూ. 22.18 కోట్ల భారీ విరాళం
ఈ కార్యక్రమంలో దివీస్ సంస్థ రూ. 12.18 కోట్లు, అరబిందో ఫార్మా రూ. 10 కోట్లకు సంబంధించిన చెక్కులను హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులకు అందించాయి. విద్యార్థుల పోషకాహారం కోసం ఉదారంగా ముందుకు వచ్చిన దివీస్, అరబిందో యాజమాన్యాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఆర్గానిక్ సేద్యం.. రైతులకు నేరుగా లబ్ధి
హరే కృష్ణ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ల ఆధారంగా సమీప ప్రాంతాల రైతులను ఆదుకునేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సీఎం వివరించారు. భోజన తయారీకి అవసరమైన కూరగాయలు, బియ్యం, ఇతర సామగ్రిని నేరుగా రైతుల నుంచే సేకరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రైతులను ఆర్గానిక్ పంటల వైపు ప్రోత్సహించడంతో పాటు నాణ్యమైన విత్తనాలు అందించి, పంటమార్పిడి విధానం ద్వారా వారికి ఆర్థిక లాభం చేకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభు జీ, దివీస్ వైస్ ప్రెసిడెంట్ మధు బాబు, అరబిందో ఫార్మా ఎండీ నిత్యానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


