న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కట్టుకథలతో బట్టకాల్చి మీదేయడమే హరీశ్ రావు పని అని ధ్వజమెత్తిన ఆయన, నీతి మాటలు చెప్పే ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో తిన్న ముడుపుల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ హయాంలో ఏపీతో కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను అణచివేశారని, పోలవరం, పట్టిసీమ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై నాటి ప్రభుత్వం ఎందుకు మౌనం పాటించిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

గత 12 ఏళ్లుగా ప్రతి జిఆర్‌ఎంబీ (GRMB) సమావేశంలో ఏపీ చెబుతున్న అభ్యంతరాలనే ఇప్పుడు కూడా ప్రస్తావిస్తోందని, అందులో కొత్తగా ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ అభ్యంతరాలను తిప్పికొట్టి సీతమ్మసాగర్–సీతారామ ప్రాజెక్టుకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (TAC) అనుమతులు తేవడమే కాకుండా 67 టీఎంసీల నీటి కేటాయింపులను సాధించిన ఘనత తమ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ట్రిబ్యునల్ ఏర్పాటును అడ్డుకుని తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించామని పేర్కొన్నారు.

సమ్మక్క సాగర్ ఎన్ఓసీ (NOC) కోసం ఛత్తీస్‌గఢ్ సీఎంను తాము మూడుసార్లు కలిశామని, ఈ నెలాఖరులోగా ఎన్ఓసీ వస్తుందని తెలిపారు. తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో బిఆర్ఎస్ నేతలు ఒక్కసారైనా ఛత్తీస్‌గఢ్ సీఎంను కలిశారా అని నిలదీశారు. ఐఎస్ఎమ్ (ISM), ఐపి (IP) క్లియరెన్స్‌ల కోసం ప్రయత్నించకుండా బిఆర్ఎస్ నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. రూ. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును ముంచి, ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పొందిన ముడుపులపై సమాధానం చెప్పలేక ఇప్పుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 5 Aug 2026 | 07:30 PM IST
Tags: