కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా ఎన్మన్ బెట్ల గ్రామంలోని వీరనాయిని చెరువుకు వెంటనే సాగునీటిని మళ్లించి రైతులను ఆదుకోవాలని బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు డిమాండ్ చేశారు. గ్రామ రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌ను నేరుగా కలిసిన ఆయన, వీరనాయిని చెరువు కింద ఆయకట్టుకు నీరందక రైతులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను కలెక్టర్‌కు క్షుణ్ణంగా వివరించారు.
ఈ సందర్భంగా ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ.. ఎన్మన్ బెట్ల రైతుల సాగునీటి సమస్య ఈనాటిది కాదని, ఏళ్ల తరబడి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడి వ్యవసాయం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పాలకులూ, అధికారులు ఇచ్చే హామీలు ఆ తర్వాత బుట్టదాఖలవుతున్నాయని మండిపడ్డారు. చెరువు నిండితేనే గ్రామంలోని అనేక మంది పేద, మధ్యతరగతి రైతుల పంటలు పండుతాయని, ఈ సమస్యపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని నెల రోజుల్లోగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టాలని ఎల్లేని కోరారు. నిర్దేశిత గడువులోగా సాగునీటి ఇబ్బందిని తీర్చకపోతే గ్రామ రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు చేపడతామని, దానికి ప్రభుత్వంతో పాటు స్థానిక పాలకులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్మన్ బెట్ల గ్రామ పెద్దలు, రైతు సోదరులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.


