కొల్లాపూర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అండగా నిలిచారు. తన ప్రయాణాన్ని మధ్యలోనే నిలిపివేసి, క్షతగాత్రుడిని తన కాన్వాయ్‌లోని వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించి పెద్ద మనసు చాటుకున్నారు.
సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలింపు
సింగోటం గ్రామ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన కావలి చంద్రయ్య కుమారుడు కావలి మల్లేష్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉండటాన్ని అటుగా వెళ్తున్న మంత్రి జూపల్లి గమనించారు. వెంటనే తన వాహనాన్ని నిలిపివేసి, ఎలాంటి ఆలస్యం చేయకుండా కాన్వాయ్ వాహనంలోనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు
బాధితుడికి తక్షణ చికిత్సతో పాటు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సంబంధిత వైద్యులను మంత్రి ఆదేశించారు. అలాగే అతని ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ప్రమాద సమయంలో వేగంగా స్పందించి ప్రాణదాతగా నిలిచిన మంత్రి జూపల్లి కృష్ణారావు మానవీయ స్పందనను స్థానికులు, గ్రామస్థులు కొనియాడారు.


