మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ భవనం కాలక్రమేణా శిథిలావస్థకు చేరడంతో ఉద్యోగులు, సేవల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పైకప్పు నుంచి నీరు కారుతుండటంతో నిత్యం విధుల్లో పాల్గొనే సిబ్బందితో పాటు, వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే ప్రజలు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
భూ రికార్డుల భద్రత పై శ్రద్ధ అవసరం
మహేశ్వరం మండలానికి సంబంధించిన అనేక కీలక భూ రికార్డులు, పాత దస్త్రాలు, రెవెన్యూ ఫైళ్లు ఈ కార్యాలయంలోనే భద్రపరిచి ఉన్నాయి. వర్షపు నీటి తేమ కారణంగా ఈ విలువైన రికార్డులు పాడైపోయే ప్రమాదం ఉందని, కాబట్టి వాటి భద్రతకు తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 20 మందికి పైగా ఉన్న సిబ్బంది ఇటువంటి పరిస్థితుల్లో విధులు నిర్వహించడం వల్ల సేవలందించడంలో కూడా కొంత జాప్యం జరుగుతోంది.
నూతన భవన పనులు వేగవంతం చేయాలి
మహేశ్వరం ఎమ్మార్వో కార్యాలయం కోసం ప్రారంభించిన నూతన భవన నిర్మాణ పనులు ప్రస్తుతం మందగించాయి. ఆ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి, నూతన భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయ్యే వరకు, ప్రస్తుతం ఉన్న సిబ్బంది భద్ర, రికార్డుల రక్షణ దృష్ట్యా కార్యాలయాన్ని తాత్కాలికంగా వేరే ప్రత్యామ్నాయ భవనంలోకి మార్చే అవకాశాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


