కందుకూరు: రైతులకు సాగునీటి అవసరాల కోసం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు, లో వోల్టేజీ సమస్యలతో పంటలు ఎండిపోకుండా చర్యలు చేపట్టడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ విద్యుత్ శాఖ ఎస్ఈ రవికుమార్, కందుకూరు డీఈ గోపాలకృష్ణ గురువారం కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ గ్రామాల్లో పర్యటించి విద్యుత్ సరఫరా పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఏ విధంగా జరుగుతోంది, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది రైతులకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశాలపై రైతులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి, వాటి ద్వారా రైతులకు అందుతున్న విద్యుత్ తీరును సమీక్షించారు.
మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేఎల్ఆర్ ఆదేశాల మేరకు ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ గ్రామాల్లో కొత్తగా 3 వంద కేవీఏ (100 KVA) సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో లో వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని స్థానిక రైతులు తెలిపారు. పంటలు దెబ్బతినకుండా వేగంగా స్పందించిన కేఎల్ఆర్తో పాటు విద్యుత్ శాఖ అధికారులకు గ్రామ సర్పంచ్ కొంగళ్ల అనిత కృష్ణ, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సత్తినేని వెంకట్ రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ బొర్ర యాదమ్మ రాములు, వార్డు సభ్యురాలు బుక్క లక్ష్మి రమేష్, జేఎల్ఎం శ్రీనివాస్ రెడ్డి, రైతులు పెంటయ్య, బాలయ్య, సిందం మంజుల, రాకేష్ గౌడ్, కొంగళ్ల కృష్ణ, సకిలాల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.


