హైదరాబాద్: కాలేయ వ్యాధులపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంపొందించే దిశగా ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ కె. ఎస్. సోమశేఖరరావు రచించిన "లాస్ట్ వార్నింగ్" (ఆంగ్లం), "ఆఖరి హెచ్చరిక" (తెలుగు) పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం యశోద హాస్పిటల్స్ (హైటెక్ సిటీ) నందు శనివారం అత్యంత ఘనంగా జరిగింది. ఈ పుస్తకాలను భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, లోక్‌సభ సభ్యురాలు డాక్టర్ శభరి బైరెడ్డి, యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. ఎస్. రావు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు.
ప్రతీ అధ్యాయంలో కేస్ స్టడీలు.. సులభమైన శైలి
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశంలో ఫ్యాటీ లివర్, వైరల్ హెపటైటిస్, లివర్ సిర్రోసిస్ వంటి కాలేయ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని, సరైన సమయానికి గుర్తించి జీవనశైలి మార్చుకుంటే వీటిని నివారించవచ్చని తెలిపారు. వైద్య పరిజ్ఞానం లేని సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా ఈ పుస్తకాలను తీర్చిదిద్దారు. మొత్తం ఆరు అధ్యాయాలు కలిగిన ఈ ప్రతీ పుస్తకంలో ఒక నిజ జీవిత కేసు స్టడీతో అధ్యాయం ప్రారంభమవ్వడం దీని ప్రత్యేకత. ప్రమాద సంకేతాలు, నివారణ మార్గాలు, ఆహారపు అలవాట్లు మరియు టీకాల ప్రాముఖ్యతపై ఇందులో సమగ్రంగా వివరించారు.
వ్యాధి రాకముందే అవగాహన కల్పించడమే ఉత్తమ వైద్యం
రచయిత డాక్టర్ కె.ఎస్. సోమశేఖరరావు మాట్లాడుతూ.. కాలేయం నిశ్శబ్దంగా పనిచేసే అవయవమని, ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ పుస్తకాలను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 'లివర్ హెల్త్ అంబాసిడర్లకు' పుస్తకాల తొలి ప్రతులను అందజేసి, ఈ గ్రంథాలను కాలేయ వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబాలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. 'సేవ్ ది లివర్ ఫౌండేషన్' ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ సోమశేఖరరావు ప్రయత్నాన్ని పలువురు ప్రముఖులు కొనియాడారు.


