హైదరాబాద్/సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను జులై 26న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

రూ. 6 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలు

మనోహరాబాద్ – సిద్దిపేట కొత్త రైలు మార్గంలో (మనోహరాబాద్ – కొత్తపల్లి ప్రాజెక్ట్‌లో భాగంగా) సుమారు రూ. 6 కోట్ల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. ప్రయాణికుల కోసం హై లెవెల్ ప్లాట్‌ఫారమ్, ప్లాట్‌ఫారమ్ పై కప్పు, ప్రయాణికులు వేచి ఉండే గది, తాగునీటి కుళాయిలు వంటి అన్ని ప్రాథమిక వసతులను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల కొమురవెల్లి మల్లస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది.

డెమూ రైలు సేవలు ప్రారంభం

ప్రస్తుతం సికింద్రాబాద్ – సిద్దిపేట మధ్య నడుస్తున్న నాలుగు డెమూ సర్వీసులకు కొమురవెల్లి వద్ద అదనపు స్టాపేజీని కేటాయించారు. స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్ నుండి సిద్దిపేట – సికింద్రాబాద్ డెమూ రైలు (నంబర్ 77654)ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ నూతన రైల్వే లైన్, స్టేషన్ వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం పెరగడమే కాకుండా, స్థానిక ఉద్యోగులు, విద్యార్థుల ప్రయాణ అవసరాలు తీరి ప్రాంతీయ సామాజిక-ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

inline-img

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 24 Jul 2026 | 06:38 PM IST
Tags: