ఆసిఫాబాద్: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు సాధించడమే లక్ష్యంగా సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు ఢిల్లీలో విస్తృతంగా పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలువురు కీలక మంత్రులను కలిసి జిల్లాకు సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.
ప్రాణహిత తుమ్మిడిహెట్టి, రహదారుల నిర్మాణంపై చర్చలు
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌ను కలిసిన ఎమ్మెల్యే.. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) చైర్మన్ అనుపమ్ ప్రసాద్ సమక్షంలో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద చేపట్టాల్సిన నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి హైదరాబాద్ - నాగపూర్ మరియు బెల్లంపల్లి - గడ్చిరోలి జాతీయ రహదారుల నిర్మాణాల ఆవశ్యకతను ప్రస్తావించారు. హైదరాబాద్ నుంచి నాగపూర్ వరకు కొత్త గ్రీన్ ఫీల్డ్ ఆక్సిస్ కంట్రోల్డ్ రహదారిని నిర్మించాలని కోరారు.
కేంద్ర మంత్రుల నుంచి సానుకూల స్పందన
బెల్లంపల్లి - గడ్చిరోలి మార్గం గడ్చిరోలిలోని ఐరన్ ఓర్ గనుల నుంచి ముడి ఇనుము రవాణాకు ఎంతో కీలకమైనదని ఎమ్మెల్యే వివరించారు. హరీష్ బాబు విజ్ఞప్తులపై స్పందించిన కేంద్ర మంత్రులు సి.ఆర్.పాటిల్, నితిన్ గడ్కరీ ప్రాజెక్టుల పురోగతికి అవసరమైన అనుమతులు, నిధుల మంజూరుకు పూర్తి హామీ ఇచ్చినట్లు తెలిపారు.


