షాద్‌నగర్: చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో శుక్రవారం తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి సహస్ర (5) అనే యూకేజీ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. కాస్లాబాద్‌కి చెందిన కృష్ణయ్య, మనీష దంపతుల కుమార్తె సహస్ర, స్థానిక అభ్యాస్ విద్యాపీఠంలో యూకేజీ చదువుతోంది.
రివర్స్ తీస్తుండగా ప్రమాదం
స్కూల్ ముగిసిన తర్వాత బస్సు చిన్నారిని ఇంటి వద్ద దింపింది. ఆ తర్వాత డ్రైవర్ బస్సును వెనక్కి తీస్తుండగా, వెనుక ఉన్న సహస్రను గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
యాజమాన్యంపై చర్యలకు స్థానికుల నిరసన
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బస్సు డ్రైవర్‌తో పాటు స్కూల్ యాజమాన్యంపై కూడా చట్టరీత్యా కేసు నమోదు చేయాలని, విద్యార్థుల రవాణాలో భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.


