షాద్‌నగర్ (రంగారెడ్డి): ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని సీఎస్కే (CSK) వెంచర్‌లో వెలుగుచూసిన పురాతన బీరప్ప స్వామి దేవాలయ స్థల వివాదంపై షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం స్పందించారు. వివాదాస్పద స్థలాన్ని ఆయన స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. అంతకుముందు తన నివాసంలో స్థానికులు, బాధితులతో సమావేశమైన ఎమ్మెల్యే, వివాదానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో కలిసి ఘటనా స్థలానికి వెళ్ళి వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. దేవాలయ స్థల వ్యవహారంలో అన్ని కోణాల్లో వాస్తవాలను పరిశీలించి, బాధితులకు న్యాయబద్ధమైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. వెంచర్ యాజమాన్యంతో పాటు స్థల యజమానులు, సంబంధిత వర్గాల ప్రతినిధులతో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రజల నమ్మకాలు, భక్తిభావాలతో కూడిన సున్నితమైన అంశం కాబట్టి ఎవరూ తొందరపాటు వ్యాఖ్యలు చేయవద్దని, వాస్తవాలు నిర్ధారించిన తర్వాతే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ సమస్యను రాజకీయం చేయడం సమంజసం కాదని, సామరస్య వాతావరణంలో పరిష్కారానికి అందరూ సహకరించాలని కోరారు.
స్థానిక కౌన్సిలర్ నడికూడ శ్రావణి మాట్లాడుతూ.. అసలు నిజాలు తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు చేయడం, మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం సరికాదని పేర్కొన్నారు. ప్రజల్లో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్, కౌన్సిలర్ శ్రావణి, నాయకులు ఖదీర్, రాయికల్ శ్రీనివాస్, బాలరాజు గౌడ్, సాదిక్, చందు నాయక్, దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


