షాద్‌నగర్ (రంగారెడ్డి): షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డు పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో డ్రైనేజీ నీరు నిల్వ ఉండటంతో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్న ఆందోళనల వేళ ముందస్తు జాగ్రత్తగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో కాకతీయ స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి, ఏరియా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యనారాయణ, ఏఎన్‌ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొని స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాల నివారణపై, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
ఈ ఉచిత వైద్య శిబిరాన్ని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, కౌన్సిలర్ పెంటయ్య సందర్శించి, వైద్య బృందం మరియు నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, భాగ్యనగర్ కాలనీలో నిలిచిపోతున్న డ్రైనేజీ సమస్యను మున్సిపాలిటీ తరఫున ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ దోమల నివారణ చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ మాట్లాడుతూ.. కాలనీలో డ్రైనేజీ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే వరకు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరం లేదా ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. వార్డు ప్రజల ఆరోగ్యాన్ని దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని స్థానికులు విశేషంగా సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.


