శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ప్రత్యేక ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో ఈ పరిస్థితి ఎదురైంది.
ల్యాండింగ్ క్లియరెన్స్‌లో ఆలస్యం
ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో 6E717 విమానం బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే రన్‌వే పైకి దిగే సమయానికి ఏటీసీ నుంచి అవసరమైన క్లియరెన్స్ సకాలంలో అందలేదు. పరిస్థితిని గమనించిన పైలట్ సమయస్ఫూర్తితో, అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని వెంటనే తిరిగి గాల్లోకి మళ్లించారు. అనంతరం విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. చివరకు రాత్రి 8.35 గంటల సమయంలో ల్యాండింగ్‌కు స్పష్టమైన సంకేతాలు రావడంతో విమానాన్ని సురక్షితంగా రన్‌వేపైకి తీసుకువచ్చారు.
229 మంది ప్రయాణికులు సురక్షితం
ఈ విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 229 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అనుకోకుండా విమానం ల్యాండ్ కాకుండా తిరిగి గాల్లోకి లేవడంతో ప్రయాణికుల్లో కొద్దిసేపు తీవ్ర ఆందోళన, ఉత్కంఠ నెలకొన్నాయి. అయితే పైలట్ సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో అందరూ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
రాష్ట్ర ముఖ్యమంత్రి అదే విమానంలో ఉండటంతో విమానాశ్రయంలోని భద్రతా అధికారులు, సీఎం సెక్యూరిటీ బృందాలు తక్షణమే అప్రమత్తమై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాయి. ప్రమాదకర పరిస్థితులను పైలట్ చాకచక్యంగా నివారించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై విమానాశ్రయ ఉన్నతాధికారులు, ఇండిగో విమానయాన సంస్థ నుంచి మరిన్ని పూర్తిస్థాయి అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.


