హైదరాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 ప్రక్రియలో భాగంగా శివాబాగ్ కాలనీ, దాసరం బస్తీల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన ఆదివారం నేరుగా సందర్శించి తనిఖీ చేశారు.
పక్కాగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి
పర్యటన సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, వాటి డిజిటలైజేషన్ పురోగతిని డీఈఓ సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా ఓటర్ల జాబితాను రూపకల్పన చేయాలని బూత్ లెవెల్ అధికారులను (BLOs) ఆదేశించారు.
ప్రజలు భాగస్వాములు కావాలి
అనంతరం స్థానిక నివాసితులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్వయంగా మాట్లాడారు. అర్హులైన పౌరులందరూ తమ దరఖాస్తు ఫారాలను సకాలంలో సమర్పించాలని, ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని తమ నమోదును నిర్ధారించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


