కడ్తాల్: రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కల్వకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షాబుద్దీన్ కోరారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 నవంబర్ 1వ తేదీ నాటికి లేదా అంతకుముందు డిగ్రీ పూర్తయిన అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ దరఖాస్తు చేసుకుని ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ దరఖాస్తుల సమర్పణకు నవంబర్ 6వ తేదీ చివరి గడువు కాబట్టి అర్హత కలిగిన పట్టభద్రులు ఆఖరి రోజు వరకు వేచి చూడకుండా ముందస్తుగానే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువత, ఉద్యోగులు, ఇతర డిగ్రీదారులు ఈ అంశంపై పూర్తి అవగాహన పెంచుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అర్హులైన వారు ఓటు నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు సహాయసహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్, వార్డు సభ్యులు భానుకిరణ్, మండల సోషల్ మీడియా కన్వీనర్ రమేష్, ప్రవీణ్ గౌడ్, గంజి చంద్రశేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 12 Oct 2026 | 09:12 PM IST
Tags: