కొత్తూరు (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందనే విమర్శలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో రోజుల తరబడి చెత్త తొలగింపు పనులు జరగకపోవడంతో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. దీనికితోడు మురుగుకాల్వలు పొంగిపొర్లుతుండటంతో వీధులన్నీ తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోయి స్థానిక ప్రజలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడుతున్నామని చెబుతున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని, క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితం చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు రికార్డుల్లో పారిశుధ్య పనులు సక్రమంగా జరిగినట్లు చూపుతున్నప్పటికీ, కాలనీల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని విమర్శిస్తున్నారు. చెత్త సేకరణలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వల్ల పలు ప్రాంతాలు చిన్నపాటి డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయని అంటున్నారు.

ముఖ్యంగా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ కాలనీలో గత వారం రోజులుగా చెత్త సేకరణ వాహనాలు రాకపోవడంతో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అలాగే రైల్వే స్టేషన్ రోడ్డులో డ్రైనేజీ నీరు నిత్యం రోడ్డుపైకి పొంగిపొర్లుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఇకనైనా మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, చెత్త సేకరణను క్రమబద్ధీకరించాలని మరియు డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని మున్సిపల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 5 Aug 2026 | 06:28 PM IST
Tags: