హుజూరాబాద్: వానాకాలం సీజన్లో సన్నరకం ధాన్యం పండించే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ రావాలంటే ఆన్లైన్లో తప్పనిసరిగా పంటల వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ సీజన్కు ప్రభుత్వం సూచించిన ఏడు రకాల ధాన్యానికి మాత్రమే క్వింటాల్కు రూ. 500 బోనస్ అందజేయనున్నారు. ప్రభుత్వం అందించే ఈ బోనస్ పొందాలంటే రైతులు తాము సాగు చేసిన సన్నరకాల విత్తనాల వివరాలను టీ-అగ్రిసీడ్స్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. రైతులందరూ సెప్టెంబర్ 10వ తేదీలోగా వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత ఏఈవోలు గ్రామాల్లో తిరుగుతూ సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తుండగా, రైతులు స్వయంగా సంబంధిత పోర్టల్లో నమోదు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
ఏడు రకాల సన్నాలు
రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల సన్న రకాల ధాన్యానికి బోనస్ ఇస్తానని స్పష్టం చేసింది. అందులో ఆర్ఎన్ఆర్ (15048), సాంబమసూరి (5204), కేఎన్ఎం (1638), హెచ్ఎంటీ (సోనా), జైశ్రీరామ్, డబ్ల్యూజీఎల్ (44), కేఎన్ఎం (7715) రకాలు ఉన్నాయి. ఈసారి రైతులు సన్న రకాల సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. అర్హులైన రైతులందరూ నిర్ణీత గడువులోగా వివరాలు నమోదు చేసుకొని ప్రభుత్వం అందించే బోనస్ సద్వినియోగం చేసుకోవాలని హుజూరాబాద్ ఏడీఏ సునీత తెలిపారు.
పత్తికి మద్దతు ధర రావాలంటే..
మరోవైపు కేంద్ర ప్రభుత్వం పత్తికి ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) రైతులకు లభించాలంటే తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తిని కొనుగోలు చేయాలంటే ఆన్లైన్ పోర్టల్లో రైతుల పేరు ఉంటేనే సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.


