కడ్తాల్: విద్యుత్ సరఫరా సక్రమంగా లేక, తరచూ కోతలు విధించడంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో విద్యుత్ కోతల వల్ల ఎండిపోయిన వరి పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు వెలిజర్ల బాలరాజ్, గొల్లపల్లి పాండుగౌడ్ తదితరులు తమ గోడును ఆయనకు వెళ్లబోసుకున్నారు. విద్యుత్ అందక పెట్టుబడులు పూర్తిగా బూడిదయ్యాయని, మూడు ఎకరాల వరకు నష్టపోయామని వాపోయారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన సింగరేణి బొగ్గును పక్కదారి పట్టిస్తూ, నాణ్యత లోపించిన బొగ్గుతో విద్యుత్ తయారు చేయడం వల్లే తరచూ లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. దీంతో బోరు మోటార్లు సైతం కాలిపోతున్నాయని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నిరంతరంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కనీసం 6 గంటలు కూడా సక్రమంగా కరెంటు ఇవ్వకపోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. పంటలు చేతికి వచ్చే చివరి దశలో ఉన్నందున తక్షణమే 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పంటలు నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం ఎకరాకు రూ. లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొప్పిడి గోపాల్, ఉప సర్పంచ్ బందరి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్, లక్ష్మీ నరసింహారెడ్డి, దశరత్ నాయక్, ఆనంద్, వీరయ్య, యాదయ్య, రంగయ్య, బాలకృష్ణ, వార్డు సభ్యులు రవికుమార్, నాయకులు బండ లింగం, బీరప్ప, బిక్షపతి, రామకృష్ణ, పాండు, జమీర్, పవన్ కుమార్, రామచంద్రయ్య గౌడ్, రమేష్, యాదయ్య, నరసింహ, సాయికుమార్, రమేష్ గౌడ్, వెంకటేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


