షాద్నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని నర్సాప్పగూడ గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, ప్రస్తుతం విద్యుత్ కోతల కారణంగా వరి పంటలు కూడా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని గ్రామానికి చెందిన రైతులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి వచ్చే పరిస్థితి లేదని వాపోయారు.
రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎంతో కష్టపడి సాగు చేసిన వరి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే నిరంతర విద్యుత్ సరఫరా అందించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఈ సమస్యపై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా తక్షణమే స్పందించి ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ కోతలకు శాశ్వత పరిష్కారం చూపి అన్నదాతల కష్టాలను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల అరవింద్ చారి, కోడిచర్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ అప్పల సిద్దయ్య, ఎంకిరాల నరసింహ గౌడ్, బి. లక్ష్మణ్ గౌడ్, నక్కల అశోక్, బి. వెంకటేష్, నీరటి మహేందర్, మంగలి లక్ష్మణ్, అంజయ్య, రాములు, లింగం, బాలరాజ్, శ్రీశైలం, కృష్ణమోహన్ గుప్తా, జంగయ్య, లక్ష్మయ్య తదితరులతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.


