కడ్తాల్: మహేశ్వరం జోన్ ఎస్ఓటీ బృందం, కడ్తాల్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ రవాణా ముఠా గుట్టురట్టయింది. బుధవారం కడ్తాల్ టోల్ గేట్ సమీపంలో ముంబై నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ. 20 లక్షల విలువైన 170 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్ మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన సరఫరాదారుతో సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు కడ్తాల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం. రవీందర్ తన సిబ్బందితో కలిసి టోల్ గేట్ వద్ద నిఘా పెట్టారు. ముంబై నుంచి కడ్తాల్ వైపు వస్తున్న నల్ల రంగు మారుతి స్విఫ్ట్ కారును అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 170 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్ (మూడు ప్యాకెట్లు) లభ్యమైంది. విచారణలో కేరళకు చెందిన నిందితులు బవుదల్ ఉమ్మర్ అబ్దుల్ అజీజ్ (34), హంసత్ షనాస్ (32) ముంబైలో సిద్ధిక్ అనే వ్యక్తి సూచనల మేరకు డ్రగ్స్ కొనుగోలు చేసి, కడ్తాల్ వద్ద రింకూ ఠాగూర్ అనే వ్యక్తికి అప్పగించేందుకు వచ్చినట్లు ఒప్పుకున్నారు. సీసీ టీవీలకు దొరక్కుండా ఉండేందుకు కారు నంబర్ ప్లేట్లను తొలగించి ఈ నేరానికి పాల్పడ్డారు.
ఈ ఆపరేషన్లో 170 గ్రాముల డ్రగ్స్తో పాటు మారుతి స్విఫ్ట్ కారు (KL-14-AE-0077), రెండు ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులపై కడ్తాల్ పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు (క్రైమ్ నెం. 373/2026) నమోదు చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ప్రత్యక్ష పర్యవేక్షణలో, మహేశ్వరం జోన్ డీసీపీ కె. నారాయణ రెడ్డి, అదనపు డీసీపీ షేక్ జహంగీర్, ఏసీపీ ఎస్. జానకీ రెడ్డిల మార్గదర్శకత్వంలో కడ్తాల్ సీఐ వి. సైదిరెడ్డి, ఎస్ఓటీ సీఐ టి. రవికుమార్, ఎస్ఐలు సురేష్, రవీందర్, చంద్రశేఖర్ ఈ దాడిలో పాల్గొన్నారు. కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని, సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీసీపీ తెలిపారు.


