పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్‌పై అత్యంత కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీనే తన కెరీర్‌లో చివరి విశ్వసమరమని ఆయన స్పష్టం చేశారు. స్పెయిన్‌తో జరగబోయే ప్రతిష్టాత్మక ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన రొనాల్డో.. ఈ టోర్నీ తర్వాత తాను మళ్లీ ప్రపంచ కప్‌లో కనిపించబోనని వెల్లడించారు.

ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడమే లక్ష్యం..

ప్రస్తుత టోర్నీలో రొనాల్డో ఆటతీరుపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ.. "ఈ ప్రపంచ కప్‌ను నేను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే నా చివరి వరల్డ్ కప్. అయితే రేపు స్పెయిన్‌తో జరగబోయే మ్యాచ్ నా చివరి ప్రపంచ కప్ మ్యాచ్ కాకూడదని బలంగా ఆశిస్తున్నా" అని రొనాల్డో పేర్కొన్నారు. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో కెరీర్‌లో ఆరో ప్రపంచ కప్ ఆడుతున్న ఆయన.. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు గోల్స్ సాధించారు. దీని ద్వారా వరల్డ్ కప్ నాకౌట్ దశలో తన తొలి గోల్ నమోదు చేయడంతో పాటు, ప్రపంచ కప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 11కు చేర్చారు.

నా రిటైర్మెంట్ నేనే నిర్ణయిస్తా..

సోషల్ మీడియాలో వస్తున్న రిటైర్మెంట్ ఊహాగానాలపై రొనాల్డో తీవ్రంగా స్పందించారు. "జాతీయ జట్టు కోసం నా శరీరాన్ని, మనసును ఎల్లప్పుడూ అంకితం చేస్తూనే ఉంటాను. నేను ఎప్పుడు రిటైర్ కావాలో నేనే నిర్ణయించుకుంటాను, ఇతరులు చెప్పినప్పుడు కాదు. ఆ విషయంపై పదే పదే ప్రశ్నించడం అనవసరం. ప్రస్తుతం మా దృష్టి అంతా రేపటి నాకౌట్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. జట్టులో పూర్తి ప్రశాంతత, సరైన ప్రణాళిక ఉన్నాయి" అని రొనాల్డో ధీమా వ్యక్తం చేశారు.

Read latest Sports News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST