హైదరాబాద్: 2014కు ముందు దేశంలో అనేక కుంభకోణాలు చూశామని, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దళారీ వ్యవస్థకు స్వస్తి పలికి నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంలో రోడ్లు, రైల్వే, ఎయిర్వేస్ రంగాలు అపూర్వ అభివృద్ధి సాధించాయన్నారు. తెలంగాణకు గత 12 ఏళ్లలో భారీగా నిధులు కేటాయించామని, రాష్ట్రంలో 41 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విసిరిన సవాల్ను తాను స్వీకరిస్తున్నానని, ఓట్లు తొలగించబడ్డారంటున్న పది మందిని నేరుగా ఎన్నికల కమిషన్ కార్యాలయానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి పరుగులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చేసే పిచ్చి తుగ్లక్ పనుల కోసం కేబినెట్ను పక్కనపెట్టి మరీ వెళ్లడం తెలంగాణ రైతులపై వారికి ఉన్న ప్రేమను తేటతెల్లం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి తక్షణమే 'ఫసల్ బీమా యోజన'ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ పథకాన్ని అమలు చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతుల కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆరు గ్యారెంట్లు అమలు చేసే వరకు రాహుల్ గాంధీని తెలంగాణలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోతోందని, 'నషా ముక్త్ భారత్' కార్యక్రమం తెలంగాణ నుంచే ప్రారంభం కావాల్సిన అవసరం ఉందని రాంచందర్ రావు పేర్కొన్నారు.


