హైదరాబాద్: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, ఆల్ సెల్స్ కన్వీనర్లు, అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులతో ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పూర్తిగా అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా రూపొందించిందని స్పష్టం చేశారు.

బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్రియను తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరాధార ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. వరుస ఎన్నికల ఓటములతో నైతిక స్థైర్యం కోల్పోయిన కాంగ్రెస్ నేతలు, ప్రతిసారీ రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న ‘ఓట్ చోరీ’ దుష్ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పన వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు చేకూరే ప్రయోజనాలను, అధికారిక నిబంధనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాంచందర్ రావు నేతలకు సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Oct 2026 | 02:49 PM IST
Tags: