హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి కొత్త వివాదాలు, చర్చలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.

వయోపరిమితి తగ్గించే ప్రతిపాదన డ్రామా

ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమేనని రామ్ చందర్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా యువతపై ప్రేమ ఉంటే, పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను తప్పించి ఆ బాధ్యతలను ఒక యువకుడికి అప్పగించి నిరూపించుకోవాలని సూచించారు.

హామీలు నిలబెట్టుకోవడంలో విఫలం

రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు నిలిచిపోయాయని బీజేపీ నేత ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత స్కూటర్లు, కొత్త ఉద్యోగాల కల్పన వంటి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

విద్యాశాఖ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సవాల్

విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకు విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా యువతకు రాజకీయాల్లో ప్రోత్సాహం ఇవ్వాలనే ఆలోచన ఉంటే, విద్యాశాఖ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీకే చెందిన యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి అప్పగించాలని రామ్ చందర్ రావు సవాల్ విసిరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Jul 2026 | 11:28 PM IST
Tags: