వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగ మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించిన ఆయన, రూ. 56 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ సబ్‌స్టేషన్లు, నూతన కార్యాలయ భవనాలు, కార్పొరేట్ మౌలిక వసతుల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
సవాళ్లను ఎదుర్కొని నిరంతర విద్యుత్ సరఫరా
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా 'ఎల్ నినో' వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. వర్షాకాలంలోనూ వేసవిని తలపిస్తూ 16,500 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనా, అదనంగా వచ్చిన 7,000 మెగావాట్ల భారాన్ని విజయవంతంగా తట్టుకుని నిరంతరాయ సరఫరా అందించామని వివరించారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి 'ప్రజా బాట', 'పొలం బాట' కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, 53 లక్షల కుటుంబాల ఉచిత విద్యుత్ బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.
'ఎలక్ట్రిసిటీ ఆంబులెన్స్' సేవలు, రూ. కోటి ప్రమాద భీమా
సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవడంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా 'ఎలక్ట్రిసిటీ ఆంబులెన్స్' సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 1912 హెల్ప్‌లైన్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనుసంధానిస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు సిబ్బంది మరణిస్తే ఇచ్చే ప్రమాద భీమాను రూ. కోటికి పెంచినట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు.


