శంషాబాద్: పట్టణ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా సాగుతున్న మసీదు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నిర్మాణంపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం
ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు నర్ర పాండు, నర్రగిరి మాట్లాడుతూ.. ప్రకాష్ నగర్ కాలనీలో అధిక సంఖ్యలో హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఇక్కడ మసీదు నిర్మిస్తే భవిష్యత్తులో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని కలెక్టర్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఈ అక్రమ నిర్మాణం గురించి గతంలోనే పలుమార్లు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆరోపించారు. దీంతో చివరి మార్గంగా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. నిబంధనల ప్రకారం విచారణ జరిపి, అనుమతులు లేకపోతే నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నర్ర శ్రీను, నర్ర రామారావు, మక్కల చంద్రశేఖర్, మక్కల ప్రేమ్ కుమార్, మక్కల రాజు, మక్కల జలంధర్ తదితరులు పాల్గొన్నారు.


