హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్–2026 (క్లస్టర్–ఎ)’ రెండు రోజుల పాటు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జూలై 9న విజయవంతంగా ముగిసింది. జూలై 8, 9 తేదీలలో సాగిన ఈ క్రీడా సంబరాలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ విభాగాల అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ శారీరక దృఢత్వాన్ని, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
ఈ క్రీడా పోటీలను జూలై 8న తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్ క్రీడా జ్యోతిని వెలిగించి ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐజీ (పి & ఎల్, స్పోర్ట్స్) డాక్టర్ గజారావు భూపాల్, ప్రముఖ టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి సహా పలువురు ఉన్నతాధికారులు ముఖ్యాతిథులుగా హాజరయ్యారు.
పోలీస్ క్రీడల్లో సరికొత్త ‘క్లస్టర్’ విప్లవం
మల్కాజిగిరి సీపీ సుమతి మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా డీజీపీ సి.వి. ఆనంద్ ఆధ్వర్యంలో ఈ ఏడాది సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ క్యాలెండర్‌కు అనుగుణంగా తొలిసారిగా రాష్ట్రస్థాయి పోటీలను ఐదు క్లస్టర్ల (A, B, C, D, E) విధానంలో నిర్వహించడం ద్వారా పోలీస్ క్రీడల చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని కొనియాడారు. ఈ విధానం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయని, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ప్రతిభావంతులను ఎంపిక చేయడం సులువవుతుందని వివరించారు.
ఈ క్లస్టర్–A పరిధిలో రెజ్లింగ్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, ఆర్మ్ రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, యోగా, జూడో, వుషు, తైక్వాండో, కరాటే, పెన్చాక్ సిలాట్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్ వంటి మొత్తం 14 ఇండోర్ క్రీడా విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ టోర్నీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21 పోలీస్ యూనిట్ల నుండి 683 మంది పురుషులు, 148 మంది మహిళలతో కలిపి మొత్తం 831 మంది క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు.
పతకాల పట్టికలో అగ్రస్థానం ఎవరిదంటే?
రెండు రోజుల పాటు సాగిన ఉత్కంఠభరిత పోరాటాల అనంతరం ఓవరాల్ పతకాల పట్టికలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఓవరాల్ ఛాంపియన్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ మొత్తం 140 పతకాలతో (64 స్వర్ణ, 44 రజత, 32 కాంస్య) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ట్రోఫీని గెలుచుకుంది.
ద్వితీయ స్థానం: తెలంగాణ స్పెషల్ పోలీస్–II (TGSP-II) విభాగం మొత్తం 58 పతకాలతో (19 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య) రెండో స్థానంలో నిలిచింది.
తృతీయ స్థానం: ఆతిథ్య మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ సైతం 58 పతకాలతో (12 స్వర్ణ, 20 రజత, 26 కాంస్య) తృతీయ స్థానాన్ని దక్కించుకుంది.
తదుపరి క్రీడల షెడ్యూల్
క్లస్టర్–A విజయవంతంగా ముగియడంతో, తదుపరి క్లస్టర్ల నిర్వహణకు అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. రాబోయే సెప్టెంబర్–2026లో క్లస్టర్–C పోటీలను తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA)లో, నవంబర్‌లో క్లస్టర్–B పోటీలను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లో, క్లస్టర్–D పోటీలను వరంగల్ కమిషనరేట్‌లో మరియు క్లస్టర్–E పోటీలతో పాటు గ్రాండ్ ముగింపు వేడుకలను నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ముగింపు సభలో విజేతలకు ఉప్పల్ జోన్ డీసీపీ కె. సురేష్ కుమార్ ఐపీఎస్, సీఏఆర్ మల్కాజిగిరి డీసీపీ కె. శ్యామ్ సుందర్ పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించిన 5 ప్రత్యేక కమిటీల సిబ్బందిని, వాలంటీర్లను సీపీ సుమతి ప్రత్యేకంగా అభినందించారు.


